కాలయమురాలైంది ! 1 m ago
మూడు వారాల క్రితం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని కాఫీ తోటలో కనిపించిన గుర్తుతెలియని, కాలిపోయిన మృతదేహాన్ని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. రమేష్ అనే 54 ఏళ్ల వ్యాపారవేత్త మూడు వారాల క్రితం కనిపించకుండా పోయాడు. అతని భార్య నిహారిక, ఆమె ప్రేమికుడు నిఖిల్ మరియు మరొక నిందితుడు అంకుర్ ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్నారు. డబ్బు కోసం హత్యకు పథకం వేసి హత్యచేసి మృతదేహాన్ని పారవేసేందుకు రాష్ట్ర సరిహద్దుల గుండా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
గుర్తు తెలియని శవం
అక్టోబర్ 8న బెంగుళూరు కొడగులోని సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు ఆ ప్రాంతం గుండా వెళ్లే వాహనాలను తనిఖీ చేయడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇందులో ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ కారు రమేష్ పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు, రమేష్ భార్య ఇటీవల తన భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కారు రిజిస్టర్ అయిన తెలంగాణలోని వారి సహచరులను సంప్రదించారు.
తీగ లాగితే...డొంక కదిలింది
విచారణ సాగుతున్న కొద్దీ రమేష్ భార్య నిహారిక (29) పాత్ర తేటతెల్లమవుతుండటంతో పోలీసులు ఆమెను అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రమేష్ హత్యలో ప్రమేయాన్ని అంగీకరించింది. ఇందుకోసం తన సహచరులు వెటర్నరీ డాక్టర్ నిఖిల్, అంకుర్ పేర్లను బయటపెట్టింది. నిహారిక బాల్యం చాలా దుర్భరంగా గడిపింది. ఆమె 16 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించాడు. ఆమె తల్లి తిరిగి వివాహం చేసుకుంది. చదువులో రాణించి నిహారిక ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. ఆమె గతంలో వివాహం చేసుకుని తల్లి అయ్యింది ఆ తరువాత విడిపోయింది. ఎప్పుడో హర్యానాలో ఉన్నప్పుడు ఆర్థిక మోసానికి పాల్పడి జైలుకు వెళ్లింది. ఆమెకు జైలులో అంకుర్‌తో పరిచయం ఏర్పడింది.
ది మోటివ్ అండ్ ది మర్డర్
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిహారిక రమేష్‌ని పెళ్లి చేసుకుంది. ఇది రమేష్‌కు కూడా రెండవ వివాహమే. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రమేష్, భార్య నిహారికకు విలాసవంతమైన జీవనశైలిని అందించాడు. ఆమె దానికి అలవాటు పడింది. ఒకానొక సమయంలో ఆమె అతనిని రూ. 8 కోట్లు అడిగింది. రమేష్ అంతమొత్తం ఇవ్వడానికి నిరాకరించాడు. నిహారికకు కోపం తెప్పించింది. ఆమె నిఖిల్‌తో రిలేషన్షిప్లో ఉండటం, అతనితో పాటు అంకుర్‌తో కలిసి ఆమె డబ్బుకోసం రమేష్ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబరు 1న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రమేష్‌ని గొంతు కోసి హత్య చేశారు. ఉప్పల్ నుండి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న కొడగుకు వెళ్లారు. అక్కడ కాఫీ ఎస్టేట్‌లో మృతదేహాన్ని పడేశారు. మృతదేహంపై దుప్పటి కప్పి నిప్పంటించారు. ఆ తర్వాత ముగ్గురు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఏమీ తెలియనట్లు నిహారిక తన భర్త రమేష్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సవాల్‌గా తీసుకుని
కొడగు పోలీసు చీఫ్ రామరాజన్ మాట్లాడుతూ, మృతదేహం అంతా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కాబట్టి ఇది సవాలుతో తీసుకున్నామన్నారు. "ఫిర్యాదు నమోదు చేయడానికి 3-4 రోజుల ముందు మృతదేహాన్ని కాల్చివేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. తమ బృదం ఆ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించిందన్నారు. శనివారం ఉదయం 12 గంటల మధ్య ఆ ప్రాంతంలో ఒక వాహనం అనుమానాస్పదంగా వెళుతున్నట్లు కనుగొన్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు తాము సిసిటివి ఫుటేజీని తనిఖీ చేసామని, కాని రాత్రి కావడంతో తాము 500 సిసిటివి కెమెరాల నుండి తుమకూరు వరకు ఉన్న ఫుటేజీని అన్ని సాంకేతిక ఆధారాలతో పరిశీలించాక కేసును ఛేధించామని తెలిపారు.